ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 7:33 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎల్ నినో ప్రభావం, NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, NEET-PG ప్రవేశ పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎల్  నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయసాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా సీజనల్ పరిస్థితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
అంచనా వేయబడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల (కాంటింజెన్సీ క్రాప్) ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) అవసరాన్ని చెబుతూ, తక్కువ నీటి అవసరం ఉండే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను సాగు చేసేలా రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.
పంటల వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.

NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష
ఈ నెల 30వ తేదీన జరగనున్న NEET-PG ప్రవేశ పరీక్ష సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లాల్లో చేపడుతున్న ఏర్పాట్లను సీఎస్ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 30 సెంటర్లలో ఈ పరీక్ష జరగనున్నందున కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు :
తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశుభ్రత, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాల ప్రత్యేకతలు, చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలో  టూరిజం అభివృద్ధి కి  27 స్పెషల్ టూరిజం ప్రదేశాలు(ఎస్ టిఎ)లను గుర్తించిందని, ఆ ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసి టూరిజం సెక్టార్ ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని సిఎస్ అన్నారు.

తెలంగాణ బ్రాండ్ ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఈ టూరిజం 20247 ప్రణాళికలు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. స్పిర్చువల్ , హెరిటెజ్, ఎకోటూరిజం, క్రాప్ట్స్ టూరిజం విస్తరణకు అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్,  వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ  కార్యదర్శి సురేంద్ర మోహన్, పోలీస్ శాఖ డిజి మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు
========================